ఇషాన్‌‌ డబుల్‌‌ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌‌లో ఈస్ట్‌‌ జోన్‌ భారీ స్కోర్

ఇషాన్‌‌ డబుల్‌‌ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌‌లో ఈస్ట్‌‌ జోన్‌ భారీ స్కోర్

చెన్నై: సౌత్‌‌ జోన్‌‌తో జరుగుతున్న దులీప్‌‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌‌ జోన్‌‌ భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌‌ ఇషాన్‌‌ కిషన్‌‌ (334 బాల్స్‌‌లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270) డబుల్‌‌ సెంచరీకి తోడు కుమార్‌‌ కుశాగ్ర (132 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 101) సెంచరీ చేయడంతో.. సోమవారం 385/4 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఈస్ట్‌‌ జోన్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 163 ఓవర్లలో 708 రన్స్‌‌కు ఆలౌటైంది. 

దాదాపు రెండు రోజుల పాటు క్రీజులో కొనసాగిన ఇషాన్‌‌ (522 నిమిషాలు) చరిత్రాత్మక ఇన్నింగ్స్‌‌తో ఆకట్టుకున్నాడు. కుశాగ్రతో కలిసి ఐదో వికెట్‌‌కు 230 రన్స్‌‌ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశాడు. ముగ్గురు జాతీయ సెలెక్టర్ల సమక్షంలో జార్ఖండ్‌‌ డైనమెట్‌‌ ఈ ఇన్నింగ్స్‌‌ ఆడటం విశేషం. అయితే దులీప్‌‌ ట్రోఫీలో ట్రిపుల్‌‌ సెంచరీలు సాధించిన రామన్‌‌ లాంబా (1987), గగన్‌‌ ఖోడా (2001) వంటి దిగ్గజాల సరసన చేరే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

సెహ్వాగ్‌‌ శైలితో..

111 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆట మొదలుపెట్టిన ఇషాన్‌‌ ఇన్నింగ్స్‌‌లో వీరేంద్ర సెహ్వాగ్ శైలి కనిపించింది. సౌత్‌‌ జోన్‌‌ బౌలర్లపై దూకుడు చూపెడుతూ ఈజీగా రన్స్‌‌ రాబట్టాడు. ఉక్కపోత వాతావరణం ఉన్నా.. అనుకూల పరిస్థితులను ఏమాత్రం వృథా చేయకుండా తెలివిగా ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఫలితంగా తొలి సెంచరీని 122 బంతుల్లో పూర్తి చేసిన అతను రెండో సెంచరీకి మాత్రం 148 బాల్స్‌‌ తీసుకున్నాడు. 

ప్రత్యర్థి బౌలర్లను అలసిపోయేలా చేసి తమ జట్టుకు భారీ స్కోరు అందించాలనే ఉద్దేశంతో బ్యాటింగ్‌‌ చేశాడు. పార్ట్‌‌ టైమ్‌‌ స్పిన్నర్‌‌ దేవదత్‌‌ పడిక్కల్‌‌ బౌలింగ్‌‌లో కవర్స్‌‌ దిశగా బౌండరీతో కెరీర్‌‌లో రెండో ఫస్ట్‌‌ క్లాస్‌‌ డబుల్‌‌ సెంచరీ (270 బాల్స్‌‌)ని పూర్తి చేశాడు. లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌ చామ మిలింద్‌‌ బాల్‌‌ పొట్టలో బలంగా తాకడంతో కాస్త ఇబ్బందిపడటంతో డబుల్‌‌ సెంచరీ తర్వాత దూకుడును తగ్గించాడు. 31 బాల్స్‌‌లో 50 రన్స్‌‌ చేశాడు. 

చివరకు అలసట రావడంతో కిషన్‌‌.. త్రిపురాన విజయ్‌‌ (4/180) బౌలింగ్‌‌లో రవిచంద్రన్‌‌ స్మారన్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. రెండో ఎండ్‌‌లో నిలకడగా ఆడిన కుశాగ్ర కెరీర్‌‌లో ఆరో సెంచరీని అందుకున్న వెంటనే వెనుదిరిగాడు. అనుకూల్‌‌ రాయ్‌‌ (45)తో ఆరో వికెట్‌‌కు 140 రన్స్‌‌ జోడించాడు.  చివర్లో కౌనైన్‌‌ ఖురేషి (40), మహ్మద్‌‌ షమీ (28) మెరుగ్గా ఆడటంతో ఈస్ట్‌‌ జోన్‌‌ భారీ స్కోరు చేసింది. మిలింద్‌‌, శ్రేయస్‌‌ గోపాల్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.